1 Corinthians 1
"దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొసైనేసును"
"కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది."
"మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక."
క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
"క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున,"
ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి.
"గనుక ఏ కృపావరము నందును లోపము లేక, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు యెదురు చూచుచున్నారు."
మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును.
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సంఘములోని కలహములు
"సహోదరులారా, మీరందరు ఏక భావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, ఏకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను."
"నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె యింటి వారి వలన నాకు తెలియవచ్చెను."
"మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరియొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము."
క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీకొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?
నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయియుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు;
అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మ మిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.
"బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను."
"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి."
"ఇందువిషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేసెదను, వివేకుల వివేకమును శాన్య పరతును అని వ్రాయబడి ఉన్నది."
జ్ఞాని ఏమయ్యెను? శాస్త్రి ఏమయ్యెను? ఈ లోకపు తర్కవాది ఏమాయెను ? ఈ లోకజ్ఞానమును దేవుడు వెర్రితనముగా జేసియున్నాడు గదా?
"దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగ కుండినందున, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను."
"యూదులు సూచకక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదకుచున్నారు."
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
"ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను యున్నాడు గాని, యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై యున్నాడు."
"దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానముకంటె జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటె బలమైనది."
"సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని,"
"ఏ శరీరము దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పచుకొనియున్నాడు."
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
ఎన్నికయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను.